రష్యాలో బందీగా కాన్పూర్ ఇంజినీర్..సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని భార్య ఆందోళన

రష్యాలో బందీగా కాన్పూర్ ఇంజినీర్..సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని భార్య ఆందోళన
  • ధాని మోదీ, సీఎం యోగిని సాయం కోరిన స్నేహా గుప్తా

మాస్కో: అధికారిక పనులపై రష్యా వెళ్లిన ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని కాన్పూర్‌‌‌‌కు చెందిన ఒక ఇంజినీర్‌‌‌‌ను మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆయన భార్య స్నేహా చందన్ గుప్తా స్పందిస్తూ.. ఎలాంటి తప్పు చేయకపోయినా తన భర్తను పోలీసులు అకారణంగా నిర్బంధించారని తెలిపారు. అంతేకాకుండా ఆయనను రష్యన్ సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాస్కోలో తన 10 ఏండ్ల కుమారుడితో కలిసి దిక్కుతోచని స్థితిలో ఉన్నానని ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

యూపీలోని కాన్పూర్‌‌‌‌కు చెందిన చందన్ గుప్తా నోయిడాలోని సెక్టార్ 62 కేంద్రంగా పనిచేస్తున్న ఒక కంపెనీలో ఇంజినీర్‌‌‌‌గా ఉద్యోగం చేస్తున్నారు. వర్క్ వీసాపై రష్యా వెళ్లిన ఆయనను ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యన్ సైన్యంలో సిబ్బంది కొరత కారణంగా విదేశీయులను సైన్యంలోకి బలవంతంగా రిక్రూట్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే తన భర్తపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు. తన భర్తను సురక్షితంగా భారత్‌‌‌‌కు రప్పించేందుకు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇది చట్టపరమైన అంశం: భారత ఎంబసీ

ఈ ఘటనపై రష్యాలోని భారత ఎంబసీ స్పందించింది. బాధిత కుటుంబంతోపాటు స్థానిక అధికారులతో టచ్‌‌‌‌లో ఉన్నామని, ఇది చట్టపరమైన అంశమని ఎంబసీ తెలిపింది. భారతీయ పౌరుడికి కాన్సులర్ యాక్సెస్ కోరినట్లు వెల్లడించింది. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గతంలోనూ వందలాది మంది భారతీయులు బలవంతంగా రష్యన్ సైన్యంలోకి బలవంతంగా చేర్పించిన ఘటనలు కలకలం సృష్టించాయి. ఇప్పటివరకు దౌత్యపరమైన 
ప్రయత్నాలతో చాలా మందిని రక్షించినప్పటికీ, కొందరు ఇంకా అక్కడే చిక్కుకున్నారు.